- జనసముద్రముగా మారిన పట్నం వారం
- జంట నగరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు
- పట్నం వారానికి హైదరాబాదు నుండి భక్తులు తరలివచ్చారు

నేటి సాక్షి చేర్యాల, జనవరి 19 : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కొమరవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కోర మీసాల మల్లన్న ను దర్శించుకోవడానికి జంట నగరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఆలయానికి నలుమూలల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు నాలుగు ఐదు గంటల సమయం పట్టింది.ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో మొదటి ఆదివారం గా పిలవబడే పట్నం వారానికి హైదరాబాదు నుండి భక్తులు తరలివస్తారు. శనివారం నుండే భక్తులు తరలివచ్చి సోమవారం వరకు ఇక్కడే బస చేస్తారు. ఆదివారం రాత్రి తోటబావి వద్ద హైదరాబాద్ యాదవులు సొంత డబ్బులతో అగ్నిగుండాలను, పెద్ద పట్నాన్ని స్థానిక ఒగ్గు కళాకారులచే రచింప చేస్తారు. అనంతరం సోమవారం ఉదయం వాటిని తొక్కి, భక్తిపారవంశంతో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం కొండపోచమ్మ కు బయలుదేరి వెళ్తారు. ఆదివారం ఉదయం తెల్లవారకముందే భక్తులు స్వామివారి పుష్కరణి లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టు కింద పట్నాలు వేసి, బోనం నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం నుంచి గుట్టపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి, డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. తల్లికి బోనం సమర్పించారు. .మల్లన్న ఆలయం చుట్టూ ఉన్న రహదారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బంది ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర సామాన్లను మోసుకుంటు వెళ్లారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు.




