Wednesday, March 25, 2026

వివక్ష మనిషిని బ్రతికున్న శవంగా మారుస్తుంది

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మనుషులందరూ పుట్టుకతో సమానమైనప్పటికీ కుల, మత, ప్రాంత, లింగ విభేదాలతో సరైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారని, వివక్ష మనిషిని బ్రతికున్న శవంగా మారుస్తుందని సోషల్ రిపబ్లిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది రాజలింగు మోతె తెలిపారు. శనివారం సున్న వివక్ష దినోత్సవం సందర్భంగా జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అట్టడుగు కులాలు, ఎల్జిబిటి కమ్యూనిటీ, స్త్రీలతో సహా అట్టడుగు వర్గాలు తమ జీవితంలోని వివిధ అంశాలలో వివక్షతను, పక్షపాతాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారని, ప్రతి ఒక్కరూ వారి కులం, మతం, జాతి, లింగ, లైంగిక ధోరణి, సామాజిక హోదాలలో వివక్ష ఉందని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినా వందల ఏండ్ల నుంచి దళితులు, బహుజనులు అంటరాని మంటల్లో కాలుతూ, ఊరి పొలిమేరలోనే జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులు, గిరిజనుల పట్ల వారి ఆచార వ్యవహారాలు, కట్టు, బొట్టు తిండి, చదువు, ఉద్యోగాల్లో వివక్ష అనేక రూపాల్లో వ్యక్తం అవుతూనే ఉందన్నారు. అదేవిధంగా నేటికీ ఆడపిల్ల అంటే నష్టం అనే భావన సమాజంలో కొనసాగుతున్నదని, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే, గర్భ విచ్చిన్నం చేయిస్తున్న సంఘటనలు నేటికీ మనం చూస్తూనే ఉన్నామన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు విద్య, వైద్యం, ఆహారం, ఆస్తి వంటి విషయాలలో తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినా, మానవ విలువలను కోల్పోతున్న పరిస్థితిని నేడు చూస్తున్నామన్నారు. వివక్ష అనేది నయం చేయవలసిన వ్యాధి అని, దానిని గుమ్మం నుంచి వెళ్లగొడితే, అది కిటికీలో నుంచి మళ్లీ ప్రవేశిస్తుందన్నారు. ఈ వివక్షను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంతో పాటు ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పు తీసుకురావాలని తెలిపారు. పౌరుల నేపథ్యంతో సంబంధం లేకుండా వారికి సమానంగా, సమాన అవకాశాలు పొందేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సమానంగా అందించడంతో వివక్ష లేని సమాజాన్ని నిర్మించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నిమ్మల శంకర్, కల్లూరి క్రాంతి, కుక్క ముడి శ్రీకాంత్, షేక్ అలీ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News