నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 1న అన్నమయ్య జిల్లాలో 100 శాతం సామాజిక పింఛన్ల పంపిణీని సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో మార్చి 1న వందశాతం పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగాలి. ఉదయం 6 గంటలకు స్వయంగా ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వాలి. పింఛనుదార్లు అందుబాటులో ఉండాలని అవగాహన కలిగేలా ముందుగానే టామ్ టామ్ వేయాలి. 1న ఉదయం 5.30కి పింఛన్ పంపిణీ చేసే సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదు. పేదవారికి… అత్యంత అవసరం ఉన్నవారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తూ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం ఇది. ఎవరైనా లబ్ధిదారు నుంచి డబ్బులు వసూలు చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 7లోగా పనులు పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ, ఉపాధి హామీ పథకాలలో భాగంగా… ఇప్పటికే ప్రగతిలో ఉన్న రహదారులు, ఫారం పాండ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గృహ నిర్మాణాలు మార్చి 7 లోగా పనులను పూర్తి చేయాలని మండల స్థాయి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలలో మండల వారీగా సమీక్షించి, ప్రగతిలో వెనకబడిన వారిని కారణాలు అడిగి తెలుసుకున్నారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేపట్టిన పనులలో మార్చి 7 లోగా పూర్తయిన పనులు కాకుండా మిగిలిన వాటిని మార్చి 15లోగా తప్పనిసరిగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. బాధ్యతాయుతం గా పనుల ప్రగతిలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రగతిని సమీక్షించుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో పలు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్డిఏ, డ్వామా, హౌసింగ్ పీడీ లు, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఎల్డిఎం, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.




