- రెండు రోజుల్లో అర్హుల ఎంపికకు సర్వే పనులు పూర్తి చేయాలి
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి ) :
ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల కార్యక్రమాలకు సంబంధించి అర్హుల జాబితా ఎంపికకు చేపట్టిన సర్వే పనులు రెండు రోజులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని బంధం పల్లిలో జరుగుతున్న రేషన్ కార్డ్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న కార్యక్రమాల అర్హుల ఎంపిక ప్రక్రియ సర్వే పెద్దపల్లి పట్టణంలో 2 రోజులలో పూర్తి కావాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం వార్డు సమావేశాలు నిర్వహించి రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాల అర్హుల జాబితా వివరాలను ప్రదర్శించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో వ్యవసాయ యోగ్యం కాని భూములను మాత్రమే రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ స్థితిగతులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత పేదలకు అవకాశం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజ్ కుమార్, డిప్యూటీ తాహసిల్దార్ స్వప్న, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





