- రూ.3 కోట్ల విలువైన 7 ఎకరాల భూమి హాంఫట్
నేటి సాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్) : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం ఊర చెరువు పక్కనే ఉన్న ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు సర్కారీ ఉద్యోగులు వారాల సత్తయ్య భార్య (రమాదేవి), వారాల గంగయ్య, వారాల మొండయ్య (అంజయ్య) కన్నేశారు. గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ అధికారుల అండతో పట్టా చేయించారు. వీరు అక్రమంగా ప్రభుత్వ భూమిని చేజిక్కించుకోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ భూమిలో ఈత, తుమ్మ చెట్లుండేవి. వాటిని పూర్తిగా నిర్మూలించడంతో గౌడన్నలకు ఉపాధి కరువైంది. తుమ్మ చెట్లను తొలగించడంతో యాదవుల గొర్రెలు, మేకలకు మేత లేకుండా పోయింది. కోట్ల విలువ చేసే భూమిని సులువుగా కొట్టేశారని, ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ గన్నేరువరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు మంగళవారం నిరసన చేపట్టారు.

గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ మైలారం గ్రామంలోని సర్వే నెంబర్ 229/2, 229/3, 229/4లో గల సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై వారి పేరున పట్టా చేయించుకున్నారని, ఆ భూమిని కబ్జా చేసి దానిలోని ఈత, తుమ్మ చెట్లను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని మార్పిడి చేయడానికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్, రెవెన్యూ అధికారులపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, నూకల చింటూ, గువ్వ పర్శయ్య, కనవేణి బాలయ్య, జక్కనపెళ్లి రాజకుమార్, కాదాసి కుమారస్వామి, మర్రి వెంకట మల్లు, నూకల రవి, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. దీనిపై పూర్తిస్తాయిలో విచారణ జరిపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

