Monday, December 23, 2024

Education: విద్యా హక్కు చట్టం అమలుకు ఉద్యమం

నేటి సాక్షి, హైదరాబాద్​: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల నిరుపేద వర్గాల హక్కుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ‘విద్యా హక్కు చట్టం’ అమలు కోసం ఉద్యమం ఆపేదే లేదని ‘రిజర్వేషన్ల పరిరక్షణ సమితి’ రాష్ట్ర అధ్యక్షుడు పొడేటి పాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్యం వచ్చి, రాజ్యాంగం ఏర్పడి 77 ఏండ్లు అయినా విద్యా వ్యవస్థ గాడిన పడలేదన్నారు. రాజ్యాధికారం అనుభవిస్తున్న పాలకులు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఈ దేశంలో రాష్ట్రంలో అక్షరాస్యత 87% వరకే ఆగిపోయిందన్నారు. అగ్రవర్ణాల వారి ప్రయోజనాల కోసం విద్యా వ్యవస్థను ప్రైవేటు పరం చేసి విద్యను కొనుక్కునేలా చేశారని ఆయన ఆరోపించారు.

గత పాలకుల హయాంలో 6 వేల స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా మూసివేసి, పేద ప్రజలకు విద్య అందకుండా చేశారన్నారు. అంతేకాకుండా సాంఘిక సంక్షేమ వసతి గృహాల పట్ల అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నారని, సరైన సౌకర్యాలు, భోజన వసతులు కల్పించకపోవడంతో ఎందరో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. చాలా వసతి గృహాల్లో వార్డెన్లు, వాచ్​మెన్లు కూడా లేరన్నారు. నేటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్, డిగ్రీ, పీజీ యూనివర్సిటీల సంఖ్యను పెంచకపోవడం.. పాలకులు కావాలనే విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 3500 ఇంటర్ కాలేజీలు ఉన్నాయని, ఇందులో దాదాపు 1500 వరకు ఇంటర్ విద్యా సంస్థలే అన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు లభించక ప్రైవేటు కాలేజీలను ఆశ్రయిస్తే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఏటా 20 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల రక్తం తాగుతున్నారన్నారు. ఇంటర్ విద్యార్థుల ఫలితాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేపర్లు తొందర తొందరగా దిద్దడంలో అవకతవకలు జరిగి మార్కులు తక్కువ వచ్చి ఎంతో మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

దేశంలో ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే 99% అక్షరాస్యత సాధించిందని, ఇందుకు ఆ రాష్ట్రం తమ రాష్ట్ర బడ్జెట్​లో 14% నిధులు కేటాయించడమే కారణమన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్​లో 12% నిధులు కేటాయించిందన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ముష్టి వేసినట్లు కేవలం 6.7% మాత్రమే నిధులు కేటాయించిందని మండిపడ్డారు. అవి అధ్యాపకుల జీతాలకే సరిపోతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే నిధుల కేటాయింపు తగ్గించి విద్యా విధానాన్ని నిర్వీర్యం చేయడంలో భాగమని పాల్ ఆరోపించారు. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్​రెడ్డి అయినా రాజ్యాంగం ఇచ్చిన విద్యా హక్కు చట్టాన్ని బాధ్యతగా అమలు చేసి, ఈ వచ్చే బడ్జెట్​లో 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకు తాము ఈ ఉద్యమాన్ని చేపట్టామన్నారు.

ఈ సమావేశంలో బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్లా లక్ష్మణ్, ఎన్పీజేఎఫ్​ రాష్ట్ర కన్వీనర్లు కొంకటి లక్ష్మణ్, మాదరబోయిన నర్సయ్య తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News