నేటి సాక్షి,మెట్ పల్లి : బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలంగాణ బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వృక్ష శాస్త్రం ఉపన్యాసకులు మామిడి విట్టల్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం రోజున ఆయన జిల్లా పర్యటనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలలో రిజర్వేషన్లు లేక విద్యార్థులు అన్ని రంగాలలో వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో బీసీలు ముందుండాలని విఠల్ పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కే.వేంకయ్య మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాలలో రాణించటానికి న్యాయ బద్దంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని అప్పుడే బీసీలకు అధికారం లభిస్తుందని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించడంతో పాటు కళాశాలకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది సంయుక్తంగా మామిడి విఠల్ ను శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు.




