Wednesday, March 18, 2026

ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి నోడల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎన్నికల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, శాసనమండలి సభ్యుల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను జిల్లాలో భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తదనగుణంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర ప్రిసైడింగ్ అధికారుల జాబితా తయారు చేయాలని, పోలింగ్ పర్సనల్, సెక్టార్ అధికారులకు డిస్పాచ్ అండ్ రిసెప్షన్ శిక్షణ అందించాలని, ప్రతి పోలింగ్ కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతున్న సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసీవింగ్ కౌంటర్, అనౌన్స్మెంట్ స్టేజ్ 1 క్రింద ఆర్ఓ, ఎఆర్ఓ, స్టేజ్ 2 లో ఆర్ఓ లను త్వరగా నియమించాలని, ఈనెల 10వ తేదీ ఉదయం స్టేజ్ 1 ఆర్ఓ, ఎఆర్ఓ లకు, మధ్యాహ్నం స్టేజ్ 2 ఆర్ఓ లకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా కేటాయించిన విధుల నిర్వహణపై శిక్షణ అందించాలని తెలిపారు. పోలింగ్ పర్సనల్ (పిఓ, ఏపీఓ.) లకు సంబంధించిన డాటా ఎంట్రీ పూర్తయిందని, వారికి కేటాయించిన మండలాలలో బ్యాచ్ లుగా విభజించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారుల సహాయంతో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. సంబందిత తహసిల్దార్, మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయతీ అధికారులు ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాలలోనే ఉండేలా చూడాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని, త్రాగునీరు, పారిశుధ్యం, మూత్రశాలలు, నిరంతర విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అవసరమైన బ్యాలెట్ బాక్సుల సంఖ్య సరి చూసుకోవాలని, మరమ్మతులు, పెయింటింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోగా అధికారులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమం మండల కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారుల సమక్షంలో పూర్తి చేయాలని తెలిపారు. రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, కమ్యూనికేషన్ ప్లాన్ లో భాగంగా పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తహసిల్దార్, రాజస్వ మండల అధికారులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఇతర అధికారుల కాంటాక్ట్ వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సైతం నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, ఆర్ఓ, ఏఆర్ఓల జాబితా సిద్ధంగా ఉందని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత సంబంధిత గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News