- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన మెటీరియల్ కంపోనెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్, డిప్యూటీ ఈఈలు, ఎఈఈ లతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద 43 కోట్ల రూపాయల వ్యయంతో మెటీరియల్ కంపోనెంట్ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో సిసి రోడ్లు, గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్ర భవనాలు, పాఠశాలల ప్రహారీగోడలు, పశువుల పాకలు, మేకల షెడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీలు తదితర పనులు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 2 వేల 50 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 1 వేయి 617 పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులను ఈ నెల 20వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ రామ్మోహన్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





