- వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చు
- క్యాన్సర్ వ్యాధికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలి
- క్యాన్సర్ రోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాలి
- ఫిజికల్ గా మెంటల్ గా ఫీట్ గా ఉంటే క్యాన్సర్ కారకాలను అధిగమించవచ్చు
- వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు):
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి సినీనటి గౌతమి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యరాలు డా.కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద నుండి కాళోజీ కళాక్షేత్రం వరకు నిర్వహించిన వాక్ ను ఎంపీ డా. కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ మాట్లాడుతూ..

గ్రామీణ స్థాయిలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు చేపట్టి, కాన్సర్ని తొలిదశలో గుర్తిస్తే నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని ఎంపీ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వస్తే పేద మధ్యతరగతి వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ చికిత్సకు, మందులకు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు. క్యాన్సర్ బారిన పడినవారు భయపడాల్సిన పనిలేదని, ధైర్యంతో క్యాన్సర్ జయించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో మొదటిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్న ప్రతిమ ఫౌండేషన్ యాజమాన్యాన్ని ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ డా. హరిణి, ప్రతిమ ఇన్స్టిట్యూట్ చైర్మన్ డా. రమేష్, డైరెక్టర్లు డా. ప్రతీక్, డా.రాహుల్, డా.అవినాష్ ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నారు.





