నేటి సాక్షి,వేమనపల్లి : రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రంజిత్ కుమార్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా బుధవారం నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ తో కలిసి వేమనపల్లి బస్టాండ్ ఆవరణలో వాహనదారులకు, ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్, కారు నడిపే డ్రైవర్లు సీటు బెల్టు ధరించాలని, ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని తెలిపారు.ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని కోరారు. రహదారులలో విధించిన వేగపరిమితిని మించి ప్రయాణించ వద్దని కోరారు. ఎక్కువ శాతం అధిక వేగంతో రోడ్డుపై వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరుగుతుందని వాపోయారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాలకు చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వాహనదారులు, ప్రజలు పాల్గొన్నారు.





