- బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయం
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ

నేటి సాక్షి, మునగాల : మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలు కొ కొల్లలుగా వెలిశాయి. గ్రామాలలో అనుబంధ సంస్థ ఎరువుల దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేసి రైతన్న కు శాపంగా మారాయి. ఎరువుల దుకాణంలో యూరియా సంచికి రూ.320 విక్రయిస్తుండగా మరో దుకాణంలో పోటాష్, ఇతర మందులు కొనుగోలు చేస్తేనే రూ.300 యూరియా బస్తా ఇస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వ ఉన్నప్పటికీ నో స్టాక్ బోర్డులు పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా 45 కిలోల యూరియా ధర రూ.265 కాగా యాసంగి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగటంతో ఒక్కసారిగా యూరియా సంచికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. మండలంలో ప్రాథమిక సహకార సంఘం, పరపతి సహకార సంఘాలతో పాటు ప్రైవేటు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. రైతులకు సరైన యూరియా లభించకపోవడంతో పక్క మండలాలకు వెళ్తున్నారు. అక్కడ వ్యాపారులు ఒక్కొక్కరు ఒక్కొక్క దర తో యూరియాను విక్రయిస్తున్నారు. వారం రోజుల నుంచి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అయిపోతుందో రైతులకు అర్థం కావడం లేదు. రైతులు వచ్చేసరికి అయిపోయిందని అందులో పని చేసే వర్కర్లు చెబుతున్నారు. ఎరువుల కోసం గంటలకొద్దీ ఎదురు చూస్తున్నారు. ఒక్కో రైతుకు నాలుగు బస్తాలు పంపిణీ చేయగా 10 ఎకరాల పైన ఉన్న పంటలకు అరకొర యూరియా ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నించారు. కొంతమందికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.





