Tuesday, March 31, 2026

పసుపు మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కిన రైతన్న

  • వేలాదిగా తరలివచ్చిన రైతులు
  • రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
  • బందోబస్త్ ఏర్పాటు చేసిన పోలీసులు
  • వాహనాలను దారి మల్లించిన పోలీసులు

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : ఆరుగలం శ్రమించిన పసుపు పంటకు మద్దతూ ధర కావాలంటూ రైతులు మంగళవారం మెట్ పల్లి పాత బస్ స్టాండ్ వద్ద బైటాయించి నిరసనకు దిగారు.పచ్చ బంగారంలా బావించే పసుపు ధర రోజురోజుకి దిగజారుతూ పండించే రైతులకు పెట్టుబడులు రానటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏండ్లుగా పసుపు బోర్డ్, మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న రైతులు పసుపు బోర్డ్ సాధించుకున్న బహిరంగ మార్కెట్ లో దిగజారుతున్న ధరలతో దిగాలుగా ఉన్న రైతు మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితినెలకొంది. పసుపుకి పదిహేను వేల మద్దతు ధర కలిపించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో దిగివచ్చి రైతులను ఆదుకోవాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో మెట్ పెల్లి మార్కెట్ యార్డ్ నుండి వేలాది మంది రైతులు ర్యాలీ గా పాత బస్టాండ్ చౌరస్తా చేరుకొని నిరసన తెలపడం జరిగింది. ఈసందర్భంగా పసుపు రైతుల కోసం పోరాటం చేసిన కీశే ముత్యాల మనోహర్ రెడ్డి మరణించగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ రైతుల పేరు చెప్పుకుని ఓట్లు వేయించుకొని ప్రభుత్వాల గద్దెనెక్కి మావి రైతుల ప్రభుత్వాలు అని చెప్పుకుంటూ రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు దక్కనప్పుడు మొకం చాటిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పసుపుకు మద్దతు ధర సంగతి దేవుడెరుగు, మార్కెట్ లో పసుపు కొనడానికి వ్యాపారులు ముందుకు రాక నిజమాబాద్ వంటి మార్కెట్ లలో రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు రైతులని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పసుపు పంటను మద్దతు ధరల పంటల జాబితా లో చేర్చి, పసుపుకి సైతం పదిహేను వేలు మద్దతు ధర ప్రకటించడం లేదా మద్దతు ధర లేని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు అనుమతి ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పసుపు పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రైతు ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు మిట్టపల్లి తిరుపతి రెడ్డి,కర్నె రాజేందర్,రైతు సంఘాల నాయకులు మారు మురళీధర్ రెడ్డి,బందెల మల్లన్న, కొట్టాల మోహన్ రెడ్డి, వేముల కర్ణాకర్ రెడ్డి,చెరుకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, ఎలిషా పాపన్న,రైతు సంఘాల పెద్దలు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

పోలీసుల భారీ బందోబస్త్
రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రైతులు చేపట్టిన నిరసనకు మెట్ పల్లి డిఎస్పీ రాములు, సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. రైతులు అధిక సంఖ్యలో తరలి రావడం తో కొత్త బస్ స్టాండ్ నుండి డిపో వరకు సుమారు రెండు కిలోమీటర్లు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. దింతో పోలీసులు వరంగల్, కరీంనగర్, జగిత్యాల నుండి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలను డిపో నుండి గోధుర్, ఇబ్రహీంపట్నం, అమ్మక్కపేట నుండి మేడిపల్లి మీదుగా దారి మల్లించారు. ఇక పట్టణ పరిధిలో నిలిచి పోయిన వాహనాలలో ఉన్న ప్రయాణికులు దాదాపు మూడు గంటలు ధర్నా జరగడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఎస్ ఐ లు కిరణ్ కుమార్, అనిల్, రాజు ట్రైని ఎస్ఐ రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News