జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్
ప్రతి ఒక్కరూ పొదుపును అలవాటు చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్బిఐ వారి “ఆర్థిక పొదుపు వారోత్సవాలు 2025” ప్రచార పోస్టర్లను జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశంతో ఫిబ్రవరి 24 నుంచి ప్రజల్లో అవగాహన కలిగే విధంగా ఆర్థిక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అంశం “ఆర్థిక అక్షరాస్యత – మహిళల శ్రేయస్సు”. సమాజంలో మహిళల బహుముఖ పాత్రను పరిగణనలోకి తీసుకుని వారికి ఆర్థిక అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని చెప్పారు. పొదుపు చేసే వనిత… సాధిస్తుంది ఘనత అనే నినాదంతో.. ఫిబ్రవరి 24 నుంచి జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో రిస్క్ డైవర్సిఫికేషన్, బాధ్యతాయుతమైన రుణాలు తీసుకోవడం, మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించడం మరియు గృహ బడ్జెట్ వంటి అంశాలు మరియు గృహిణులు, శ్రామిక మహిళలు మరియు మహిళా వ్యవస్థాపకులపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పిస్తారన్నారు. మహిళలు ఇంటి ముఖ్య అవసరాలను సరిగా గుర్తించాలి… అలాగే పొదుపు చేయాలన్నారు. తెలివిగా నడుచుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. ఈ మేరకు ప్రతి బ్యాంకులో ఆర్థిక పొదుపు గురించి బ్యాంకుకు వచ్చే ప్రజలకు, మహిళా లబ్ధిదారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అలాగే డబ్బులను అనవసరంగా ఖర్చులు పెట్టకుండా పొదుపు చేయడం, అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం, డిజిటల్ చెల్లింపులు అలవాటు చేసుకోవడం, డిజిటల్ చెల్లింపుల సందర్భంగా మోసపోకుండా అప్రమత్తతతో వ్యవహరించడం తదితర అంశాలలో అవగాహన కల్పించడంతోపాటు పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. వీటన్నిటిపై ప్రజలు, ముఖ్యంగా మహిళలు అవగాహన కల్పించుకుని ఆర్థిక సాధికారతను సాధించాలని కలెక్టరు పేర్కొన్నారు.




