- వైద్యాధికారి డాక్టర్ జె.దినేష్
- కొత్తపట్నం, సిద్ధవరం గ్రామాల్లో మహిళలకు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో శుక్రవారం గూడూరు డివిజన్ లోని వళ్లిపేడు పిహెచ్ సి పరిధిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించినట్టు వైద్యాధికారి డాక్టర్ జె.దినేష్ తెలిపారు. ఇందులో భాగంగా కొత్తపట్నం, సిద్ధవరం గ్రామాల్లో మహిళలకు నోటి పరీక్షలతోపాటు మామోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. కాగా, మార్చి 10న వంజివాక, కొక్కుపాడు, మార్చి 11న నెల్లూరుపల్లి కొత్తపాళెం, ఉడతవారిపాళెంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చైతన్యభాను, డాక్టర్ పద్మావతి, సర్పంచులు తిరుపాలయ్య, సుజాత, ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు అల్లాభక్షు, మధు, హిమజ, స్థానిక నాయకులు మురళి, రామలింగారెడ్డి, సూపర్వైజర్ భువనేశ్వరి, ఎంఎల్ హెచ్ పిలు ఐ.గౌతమి, ఇ.సౌజన్య, ఏఎన్ఎం కె.నాగమణి, స్థానిక వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు



