- ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
- ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

నేటి సాక్షి-కరీంనగర్: మహిళల సమస్యలు పరిష్కరించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు శుక్రవారం సభ ద్వారా సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ లోని జగ్జీవన్ రావ్ కాలనీ అంగన్ వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మహిళలతో మాట్లాడారు. అంగన్ వాడీ కేంద్రంలో జరిగే ఈ సభకు వస్తే మహిళలకు అన్ని ఆరోగ్య విషయాలు తెలుస్తాయన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, ఊరు.. తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు తమ భోజనంలో అన్ని పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. గర్భిణీగా నిర్ధారణ అయినప్పటి నుంచి పోషకాహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటే మందుల అవసరం ఉండదని.. గర్భిణులు తప్పనిసరిగా కాల్షియం, ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని.. మహిళలు విధిగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలే ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకుంటే రూ.40 వేలకు పైగా ఖర్చు అవుతాయన్నారు. బీపీ, షుగర్, రక్తహీనత తదితర వైద్య పరీక్షలతో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలతో పాటు అన్ని రకాల మందులు ఉచితంగా అందజేస్తారని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు, ప్రాథమిక పాఠశాలలకు పిల్లలను పంపించాలని సూచించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల సందర్శన. కిసాన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బోధనా తీరును అడిగి తెలుసుకున్నారు. పలు పాఠ్యాంశాలను ప్రశ్నించగా చిన్నారులు సరైన సమాధానం చెప్పడంతో కిసాన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పాఠశాలలోనే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం కోసం అదనపు గది నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యువో సబిత, మెప్మా పీడీ వేణుమాధవ్, డిప్యూటీ డిఎంహెచ్వో సుజాత, డిసిపిఓ పర్వీన్, పిఓ సనా తదితరులు పాల్గొన్నారు.



