తొలి రోజున 35వేల మందికి వడ్డింపు
ప్రారంభించనున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుమల దశాబ్దాల క్రితం తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు రుచికరమైన భోజనాన్ని అన్న ప్రసాదంగా ప్రారంభించిన దివంగత నేత ఎన్టీ రామారావు ఆశయాలకు మరింత మెరుగులు దిద్దే విధంగా శ్రీవారి భక్తులకు నేటి నుండి అన్న ప్రసాదంతో పాటు మసాలా వడలు కూడా వడ్డించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తొలి బంతి నుండి టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా మసాలా వడలను భక్తులకు వడ్డించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు నూతనంగా నిర్మించిన వకుళా మాత వంటశాలలో తొలి రోజున 35 వేల మసాలా వడలు తయారు చేయడానికి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నాలుగు గంటలకే మసాలా వడలను తయారు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి 9 గంటలకల్లా అన్న ప్రసాద భవనానికి తరలించి భక్తులకు వడ్డించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రస్తుతం వడ్డిస్తున్న వంటకాలతో పాటు అదనంగా శ్రీవారి భక్తులకు మసాలా వడ ఊరగాయలను కూడా అందించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుని కొద్ది మాసాలు కావస్తున్నప్పటికీ అమలు చేయకపోవడంతో ఇటీవలే అధికారులపై చైర్మన్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటివరకు కుంటి సాకులు చెబుతూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు కార్యాచరణకు దిగారు. బుధవారం వకుళమాత వంటశాలలో మసాలా వడలు తయారు చేసేందుకు సరైన కుక్ లు లేకపోవడంతో 6 మంది టిటిడి ఉద్యోగులు, 25 మంది సులభ వర్కర్లు ను ఆగమేఘాలపై విధులకు నియమించారు. వీరి చేతనే మసాలా వడలను తయారీ చేయించే కార్యక్రమానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ఆదేశాలను అమలు చేసేందుకు ఆఘమేఘాలపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా టిటిడి నిత్యాన్నదాన భవనంలో పనిచేస్తున్న టిటిడి ఉద్యోగులైన వంట మనుషులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, కొత్తవారిని తీసుకోకపోవడం తదితర సమస్యల కారణంగా విశ్రాంత అధికారుల పెత్తనం పెరిగిపోవడంతో కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.



