నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ తన్నీరు శరత్ రావు శుక్రవారం గోల్డ్ లోన్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర బ్యాంకులతో పోలిస్తే అధికంగా, గ్రాముకు ₹5,500 రుణం అందిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజే 7 ఖాతాదారులకు మొత్తం ₹14 లక్షల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ రుణాలపై వడ్డీ రేటు 11% గా ఉంటుందని తెలిపారు. అదనంగా, సంఘంలో లాకర్ సదుపాయం మరియు వాహన రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాహన విలువలో 75% వరకు రుణం ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతు సోదరులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు బండి రమేష్, డైరెక్టర్లు సీత భూమయ్య, మచ్చ రాజేశం, బెజ్జంకి నరేష్ బాబు, సీఈఓ శ్రీనివాస్, అప్రైజర్ బోనాల రాజు మరియు సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.





