Saturday, March 14, 2026

అర్హత ఉన్న ప్రతి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు

  • రేషన్ కార్డు జారీ నిరంతర ప్రక్రియ
  • ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం
  • అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
  • పంట వేసినా, వేయకున్నా రైతు భరోసా
  • భూమిలేని కూలీకి 12 వేలు
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేటి సాక్షి-కరీంనగర్: అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందుతాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో భాగంగా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో బుధవారం గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందన్నారు. ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. పెళ్లయిన వారికి విడిగా కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల మార్పు చేర్పులు అన్ని పూర్తి చేస్తామన్నారు. గతంలో మీసేవ, ప్రజావాణి, సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలిస్తామని, అర్హత ఉన్న వారందరికీ కార్డు ఇస్తామని అన్నారు. గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకున్నా అదే సభలో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. 2014లో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే గత పది సంవత్సరాలలో కేవలం 40,000 మందికి మాత్రమే రేషన్ కార్డు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తుందని అన్నారు. అందరికీ రేషన్ కార్డు అందిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అర్హత ఉన్న వాళ్లందరికీ ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టామని, ఇండ్ల మంజూరు జాబితాలో పేరు లేకుంటే దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. స్వంతస్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఎస్సీ ఎస్టీలకు మరో లక్ష ఆదనంగా ఇస్తామని తెలిపారు. సాగు చేసేందుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12000 రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. పంట వేసినా వేయకున్నా వ్యవసాయానికి ముఖ్యంగా ఉంటే రైతు భరోసా అందుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి 12,000 అందజేస్తున్నామని అన్నారు. ఇన్ని ప్రభుత్వ పథకాలు ఒకేసారి అమలు చేయడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని అన్నారు. గతంలో ప్రజా పాలన సమయంలో దరఖాస్తు ఫారం సరిగ్గా నింపకపోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గ్రామసభ పూర్తయిన తర్వాత కూడా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వవచ్చని అన్నారు. అన్ని దరఖాస్తులు పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News