- జాబితాల్లో పేర్లు లేని వారి నుండి మళ్లీ దరఖాస్తుల స్వీకరణ
- పదేళ్లుగా రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్ ఆందోళన లు మాని ఆత్మ పరిశీలన చేసుకోవాలి
- ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం
- ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

నేటి సాక్షి ,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ప్రజా పాలన గ్రామసభకు ఎమ్మెల్యే విజయరమణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలన గ్రామసభల్లో చదివిన జాబితాల్లో వివిధ పథకాల కింద పేర్లు రాని అర్హులు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తులపై తక్షణమే విచారణ జరిపి వారిని ఎంపిక చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే విజయరమణ రావు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల తమ పాలనలో ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించిన పాపాన పోలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దశల వారిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, రూ. 500 లకే వంట గ్యాస్,రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 10 లక్షలకు పెంపు,ఇండ్లకు ఉచిత కరెంటు వంటి పథకాలను ఇప్పటికే అమలు చేయడం జరిగిందని, ప్రస్తుతం కొత్తగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నెలకు రూ 1 వెయ్యి చొప్పున వారి ఖాతాల్లో జమ, పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పెంపు వంటి సంక్షేమ పథకాలను ఈనెల 26 నుండి అందించడం జరుగుతుందని చెప్పారు. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు.ఈ విషయంలో ఎలాంటి అవినీతికి,అనుమానాలకు తావు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, సన్నవడ్ల కు రూ. 500ల చొప్పున బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని అన్నారు. ఇలాంటి ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయని బీఆర్ఎస్ రైతు దీక్షల పేరిట మొసలి కన్నీరు కారుస్తోందని ఎమ్మెల్యే విజయరమణ రావు ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాటు ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అధోగతి పాలు చేసిన ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆందోళనలు చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గొల్లపల్లి గ్రామంలో తాను ఇచ్చిన హామీ మేరకు సిసి రోడ్లను నిర్మిస్తున్నామని, గ్రామానికి త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, దాన్నాయక దామోదర్ రావు, చిలుక సతీష్, జాని, శ్రీగిరి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బండారి రమేష్,పన్నాల రాములు,సంపత్ రావు, సందీప్,రాజు,రాజీ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




