- – కళాశాలను సందర్శించిన ఎంఐఎం నాయకుడు, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్

నేటి సాక్షి, కరీంనగర్: నగరంలోని మైనార్టీ గురుకుల బాలుర కళాశాల-3 మగ్ధూమ్ పూర్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మంచిర్యాల జిల్లా చెన్నూరు కు చెందిన విద్యార్థి నదీముద్దీన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కళాశాల ఉన్నచోటనే రాజీవ్ రహదారిపై లారీ ఢీ కొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని సుల్తానాబాద్పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఎంఐఎం నాయకుడు, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, ఖాజా మజారొద్దీన్ తక్షణమే మగ్ధూమ్ పూర్ మైనార్టీ గురుకులానికి చేరుకున్నారు. విద్యార్థి నదీముద్దీన్ మృతికి సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమోహన్, సుల్తానాబాద్ ఎస్సైతో తెలుసుకున్నారు. మొదట కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చేరుకొని మార్చరీలో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థి నదీముద్దీన్ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్ మాట్లాడారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు మాట్లాడుతూ కళాశాలలో వెనకవైపు గోడ మూడు ఫీట్లు మాత్రమే ఉండడంతో విద్యార్థులు సులువుగా బయటికి వెళ్లే అవకాశం ఉన్నందున ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. గోడ ఎత్తు ఎందుకు పెంచలేదని, విద్యార్థులకు తగినంత సెక్యూరిటీ ఎందుకు కల్పించలేదని కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని, వారికి స్వేచ్ఛగా చదువు చెప్పడంతో పాటు తగినంత సెక్యూరిటీ కల్పించాలని, భద్రతాపరమైన లోపాలు ఎక్కువగా ఉన్నాయని, రోడ్డుకు దగ్గరగా కళాశాల ఉండడంతో విద్యార్థులు సులువుగా బయటికి వెళ్లిపోతున్నారని, ఇదంతా కొద్ది రోజులుగా జరుగుతున్నప్పటికీ భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. కలెక్టర్ తో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు కళాశాలను సందర్శించి జరిగిన పరిణామంపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు ఈ కళాశాలలో భద్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ప్రాణం బలిగొన్న లారీని గుర్తించి లారీపై, లారీ డ్రైవర్ పై హత్య కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
– పోలీసుల కన్ఫ్యూజన్..
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి జరిగిన ఘటనపై పోలీసులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రమాదం జరిగిన స్థలం సుల్తానాబాద్ పరిధిలోకి రాగా, మగ్దూంపూర్ మైనార్టీ గురుకుల పాఠశాల కరీంనగర్ రూరల్ పోలీసుల పరిధిలోకి వస్తున్నది. అయితే, మొదట ఘటన స్థలానికి సుల్తానాబాద్ పోలీసులు చేరుకొని, పంచనామ చేశారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా పాఠశాల వద్ద బందోబస్తు నిర్వహించారు. కొందరు నాయకులు గురుకులానికి చేరుకొని ఆరా తీయగా, అంతలోనే కరీంనగర్రూరల్ పోలీసులు పాఠశాలకు వచ్చారు. వివరాలు తీసుకున్నారు. కొద్దీ సేపు అక్కడ అయోమయం నెలకొంది.






