ఆసుపత్రి వద్ద ఆకులు తింటూ కార్మికుల నిరసన
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
జిల్లాలోని బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కార్మికులు, కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నారని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆసుపత్రి వద్ద కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ, ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించలేదని అన్నారు. గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, పిఎఫ్ పేరుతో కోత విధించిన డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయడం లేదని, యూనిఫాం,గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, కార్మికులు ఆందోళన బాట పట్టారని తెలిపారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నా, అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జిల్లా అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో జనవరి 20న ఛలో జిల్లా కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ధర్నాకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోత విధించిన పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దూలం శ్రీనివాస్ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, దూలం శ్రీనివాస్, సీఐటీయు బెల్లంపల్లి మండల కన్వినర్ చల్లూరి దేవదాస్, ఆసుపత్రి కార్మికులు పాల్గొన్నారు.





