- – అటవీ జంతువుల మాంసంతో పట్టుబడ్డ వ్యక్తి
- – అడవి పిల్లి, కుందేలు, చుక్కల దుప్పి తల లభ్యం
నేటి సాక్షి, వేమనపల్లి: మంచిర్యాల జిల్లా నీల్వాయి బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, మల్లంపేట వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న వ్యక్తిని తనఖీ చేయగా, అతని వద్ద అటవీ జంతువుల మాంసంతో పాటు ఇతర శరీర భాగాలు లభ్యమయ్యాయని నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ పేర్కొన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులు వ్యక్తి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా, అడవి పిల్లి, కుందేలు కళేబరం, చుక్కల దుప్పి తల, ఇతర భాగాలు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన వ్యక్తిని విచారించగా, తన పేరు తోకల జీవన్ అని, కల్మలపేట అని తెలిపాడు. తన వద్ద రెండు బ్యాటరీలు, టార్చ్ లైట్ సహాయంతో జంతువులను వేటాడినట్టు ఒప్పుకున్నాడు. దీనిపై అటవీ శాఖ అధికారులు విచారణ చేయగా, ఉండ్రాల్ల పోషం కూడా నిందితుడని, ఇంకా అనుమానితులపై విచారణ జరుగుతున్నట్లుగా అటవీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో బీట్ అధికారి మహిపాల్ పోలీస్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.





