నేటి సాక్షి, కరీంనగర్: స్థానిక భగత్‌నగర్‌లోని అద్విత ఇంటర్నేషనల్ పాఠశాలలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. చిన్నారులు అమ్మవారి, పోతరాజుల వేషాలతో నృత్యాలు చేస్తూ బోనాలతో ఊరేగింపుగా వెళ్లి, అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సౌగాని అనుదీప్ మాట్లాడుతూ ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలు పూర్వకాలంలో వర్షాకాలం ఆరంభంలో వచ్చే కలరా, అతిసారం తదితర వ్యాధులు ప్రబలకుండా వేపాకు, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉందని తెలిపారు.
ఈ పండగ ద్వారా ప్రజలందరూ ఆయురారోగ్యాలను కలిగి ఉండాలని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కుకునేవారని చెప్పారు. ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడంతో విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేవాళ్లం అవుతామని, వారసత్వం అందించిన వారు అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.