- అర్హత ఉన్నవారందరికి కొత్త రేషన్ కార్డులు
- రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
నేటి సాక్షి, చేర్యాల్: అర్హత ఉన్నవారందరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో మరియు కొండపాక మండలం దర్గా గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో పాల్గొన్నారు. గ్రామ సభల సందర్బంగా ప్రజా పాలన గ్రామ సభ ఉద్దేశాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నేటినుండి 24 వ తేదీ వరకు మూడు రోజులు ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరిగిందని ఆ వెరిఫికేషన్ జాబితా ను గ్రామసభలలో సభ్యులకు వినిపించి అనర్హులు మరియు అర్హత ఉండి జాబితాలో లేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులను స్వీకరించి మళ్లీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందించడం జరుగుతుంది అని అన్నారు. 2023 24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు ఈజీఎస్ లో కూలీలుగా పనిచేసే భూమిలేని రైతు కూలీలను ఎంపిక చేసి సంవత్సరానికి 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ఇవ్వడం జరుగుతుందని. వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరానికి 12 వేల రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందని అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కానీ రాళ్లు రప్పలు ఉన్న భూమి, వివిధ ప్రాజెక్టుల కింద పైన భూమి, రహదారులు, వెంచర్లు తదితర భూములకు రైతు భరోసా ఇవ్వడం కుదరదని తెలిపారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి మరియు కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రజా పాలన కార్యక్రమం మరియు సోషియో ఎకనమిక్ సర్వే ద్వారా సేకరించిన డాటా ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి జాబితా సిద్ధం చేయడం జరిగిందని ఆ జాబితాలో అభ్యంతరాలు మరియు అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని గ్రామ/ వార్డు సభల సమావేశానికి రానివారు మండల కేంద్రాల్లో/మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇల్లు లేని వారిలో సొంత ఇంటి జాగా ఉండి కొంత మంది సొంత ఇంటి జాగా లేని వారు మరియు నివాసానికి యోగ్యం కానీ ఇండ్లలో ఉంటున్న వారు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి లిస్టు తయారు చేయడం జరిగిందని ఆ లిస్టులో పేరు లేని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మొత్తానికి ఇల్లు లేని వారు, పూరి గుడిసెలు, పెంకుటిన్లలో నిర్వహించే వారికి, వితంతువులకు, దివ్యాంగులకు, ట్రాన్స్ జెండర్ లకు మరియు వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కాబట్టి గ్రామ/వార్డు సభలో చదివే లిస్టులో పేర్లు లేని వారు ఎవరు ఆందోళన చెందకుండా గ్రామ/పట్టణ సభలు మరియు మండల కేంద్రాల్లో/ మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవ కేంద్రాలు, కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమాలలో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





