- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– జిల్లాలో మార్చి 5 నుండి మార్చి 25వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య లతో కలిసి ముఖ్య పర్యవేక్షకులు, సంబంధిత అధికారులతో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4 వేల 965 మంది జనరల్, 935 మంది ఒకేషనల్, ద్వితీయ సంవత్సరంలో 5 వేల 625 మంది, 1 వేయి 15 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, త్రాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళే సమయంలో తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థినులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రంలోని మొబైల్, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదని, తనిఖీ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ప్రశ్నా పత్రాలు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని, ప్రశ్నా పత్రాలు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసర వైద్య సేవలు నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆయా రూట్లలో సమయానుసారంగా బస్సులు నడిపించాలని తెలిపారు. పరీక్ష ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగే విధంగా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ముఖ్య పర్యవేక్షకులు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




