Friday, March 27, 2026

ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కొరకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి రోజు జనరల్ పరీక్షకు 5 వేల 697 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5 వేల 472 మంది, ఒకేషనల్ పరీక్షకు 668 మంది హాజరు కావలసి ఉండగా 606 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, త్రాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, విద్యార్థుల పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళే సమయంలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోని మొబైల్, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం జరుగదని, ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసర వైద్య సేవలు నిమిత్తం వైద్య సిబ్బందిని నియమించి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆయా రూట్లలో సమయానుసారంగా బస్సులు నడిపించడం జరుగుతుందని, పరీక్ష ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలను బందోబస్తు మధ్య తరలించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచుతూ పరీక్ష సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News