Friday, March 20, 2026

మనది మంగళవారం, మందిది సోమవారమా కేసీఆర్ ?

నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న తండ్రి కొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు మనది మంగళవారం.. మందిది సోమవారం.. అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు ఘాటు విమర్శలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పైన కేసీఆర్, కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే తలసానిని మంత్రిగా చేసినప్పుడు కేసీఆర్ ను కేటీఆర్ ఎందుకు నిలదీయ లేదని, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు కేటీఆర్ కు ఈ వాస్తవాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎటు పోయిందో కెసిఆర్, కేటీఆర్ లు చెప్పాలన్నారు. అధికార మదంతో ప్రతిపక్ష హోదా సైతం లేకుండా అప్పటి శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్కకు అన్యాయం చేయడం ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ కనీసం శాసనసభలో దళితున్ని శాసనసభ పక్షనేతగా కూడా చూడలేక పోయారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులపై నేడు వేదాలు వల్లిస్తుండడం హాస్యాస్పదమని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని అన్నారు. ప్రతిపక్షం ఒక బాధ్యతాయుతంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అలాంటి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా కేసీఆర్, కేటీఆర్ లు గతంలో వ్యవహరించిన తీరును అందరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆనాడు ఇలాంటి క్షమించరాని పొరపాట్లు చేయకపోయి ఉంటే ఈనాడు కేసీఆర్ పార్టీకి కూడా ఈ గతి పట్టేది కాదని అన్నారు. రాజకీయాల్లో ఎల్లప్పుడు విలువలు పాటించాలని గుర్తు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అసలు ఉండకూడదని ఒక దుర్మార్గమైన బుద్ధితో ఆనాడు కేసీఆర్ టిడిపి ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని రాజకీయాల్లో దుర్మార్గమైన పద్ధతులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తాను చేసిన దుర్మార్గాలే నేడు వెంటాడుతుంటే ఇప్పుడు పెడ బొబ్బలు పెట్టడం కేసీఆర్ కు తగదని హితవు పలికారు. మనకు ఓ న్యాయం మందికి మరో న్యాయం ఉండకూడదని అందరికీ ఒకే న్యాయం ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమాజంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదని అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎవరైనా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే వారు తిరిగి వాటి ఫలితాలను భవిష్యత్తులో అనుభవించక తప్పదని కొల్లు హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News