నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజిక అభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేయాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ ఎల్ మోతె అన్నారు. గురువారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్న ఆదేశ సూత్రాల ప్రకారం ప్రభుత్వం పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలని, సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలని తెలిపారు. పౌరులకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. న్యాయాన్ని కూడా ఉచితంగా అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు కాగితపు సునీల్ కుమార్, నడిపెల్లి సునీల్ రావు లు పాల్గొన్నారు.





