Monday, December 23, 2024

Let’s stop the accusations : తిట్లు.. ఆరోపణలు బంద్ చేద్దాం : బండి సంజయ్​

నేటి సాక్షి, సిరిసిల్ల: ‘ఎన్నికలైపోయినయ్. ఇకపై ఒకరినొకరు తిట్టుకోవడం బంద్ చేద్దాం. రాజకీయ విమర్శలు, ఆరోపణలను పక్కనపెట్టి అభివృద్ధిపైనే ఫోకస్ పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలో రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్​తో నిర్మించనున్న మున్నూరుకాపు సంఘ కల్యాణ మండపానికి బండి శంకుస్థాపన చేశారు. కల్యాణ మండపం ఆవరణలో మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్​ను సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బండి సూచించారు. 
కేంద్ర ప్రభుత్వం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ విషయం కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తాను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, అందరూ సహకరించాలని కోరారు. కుల సంఘం ఆఫీస్​ను నిర్మిస్తే ఆ సంఘంలోని నాయకులకే ఉపయోగపడుతుందని, కానీ, కుల సంఘాల తరపున కల్యాణ మండపాలు నిర్మిస్తే, ఆ కులంలోని ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇలాంటి వాటికి మాత్రమే ఎంపీ లాడ్స్ నిధులిస్తున్నానని, ఏ కుల సంఘమైనా సరే.. ఆ కులంలోని పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకున్నప్పుడు మాత్రమే కుల సంఘాలకు మనుగడ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
‘నేను మీలో ఒకడిని, మున్నూరు కాపు సంఘం చేపట్టే ప్రజోపయోగ పనులకు తనవంతు పూర్తి సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నా. మున్నూరుకాపు సంఘం పెద్దల ప్రతిపాదన మేరకు కంపౌండ్ వాల్ నిర్మాణానికి సహకరిస్తా’ అని చెప్పారు.
రెండోసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో సిరిసిల్ల జిల్లా ప్రజల భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. రెండోసారి గెలవడంతోనే మోదీ కేబినెట్​లో తనకు చోటు దక్కిందని చెప్పారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వేశాఖలతో పాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఆయా రంగాల నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News