- పార్టీ నాయకులు, బాధితులకు పరామర్శ
- ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేస్తారా..?
- అధికారులంతా హైకోర్టులో సమాధానం చెప్పాలి
- పాకాల మండలంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల): ప్రజల బాధలు వింటూ.. వారిని ఓదారుస్తూ అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తూ పార్టీ నాయకులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ.. మీకు అండగా నేనుంటాను అన్న భరోసా కల్పిస్తూ చంద్రగిరి నియోజకవర్గ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన సాగింది. గురువారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాకాల మండలం గానుగపెంట పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ రవి పాల సేకరణ కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి కాల్చివేశారు. ఆ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురువారం అక్కడకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం పలువురు గ్రామ పెద్దలు మోహిత్ రెడ్డితో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు చూడలేదని, పల్లెల్లో ఇది మంచిది కాదన్నారు. గత పదేళ్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా వున్నప్పటికీ ఎక్కడా ఇలాంటి దాడులు జరగలేదన్నారు. అనంతరం గానుగపెంట సర్పంచ్ భాగ్యలక్ష్మి చెక్ పవర్ రద్దు చేయడానికి అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో బుధవారం ఆ గ్రామంలోకి డివిజనల్ పంచాయతీ అధికారి వెళ్లి విచారణ చేయడం తదితర అంశాలపై మోహిత్ రెడ్డితో చర్చించారు. రాజ్యాంగ బద్ధంగా సర్పంచ్ అయిన భాగ్యలక్ష్మి ఇంటికి వెళ్లిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అకారణంగా చెక్ పవర్ రద్దు చేసే హక్కు ఎవ్వరికీ లేదని, దానిపై హైకోర్టులో సవాల్ చేసుకుందామని ధైర్యం కల్పించారు. అనంతరం ఆ గ్రామంలో చెవిరెడ్డి వేసిన సిమెంటు బెంచీలకు పసుపు రంగులు పూయడాన్ని తప్పు పట్టిన గ్రామస్తులు అడ్డుకున్నందుకు పాల సేకరణ కేంద్రాన్ని కాల్చివేశారన్నారు. గ్రామస్తుల మాటలు పూర్తిగా విన్న తరువాత ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వారికి దేవుడు శిక్ష వేస్తాడని, ప్రజలను భయపెట్టడం నాయకత్వం అనిపించుకోదన్నారు.
హైకోర్టులో సమాధానం చెప్పాలి
జగనన్న ప్రభుత్వంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో తయారు చేయించిన సిమెంటు బెంచీలకు టీడీపీ రంగు (పసుపు)లు వేస్తారా..? హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అనుమతులు ఇచ్చిన అధికారులు అంతా హైకోర్టులో సమాధానం చెప్పాలి. గ్రామాల్లో ప్రజలు ఎదురు తిరిగితే పోలీసులను పెట్టి భయపెడతారా..? ఎంత మందిపై కేసులు పెడతారు..? ఎంత మందిని జైలులో వేస్తారు..? ఈ రోజు తప్పు చేస్తున్న ప్రతి అధికారి భవిష్యత్తులో బాధపడే రోజు వస్తుంది. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓపికగా పోరాడాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధైర్యం చెప్పారు.





