- సీపీఐ నాయకుల డిమాండ్
నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్): రుణమాఫీ కాని రైతులను గుర్తించి, రుణమాఫి వర్తించేలా చూడాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కోరారు. సోమవారం గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్లో సీపీఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం మొదటి దఫాగా రూ.లక్ష రుణ మాఫీ ప్రకటించినా, చాలామంది రైతులకు వర్తించలేదని చెప్పారు. వ్యవసాయ అధికారులను అడిగితే, బ్యాంకర్లు తమకు సహకరించడం లేదని చేతులెత్తుస్తున్నారని పేర్కొన్నారు.
బ్యాంక్ అధికారులతో మాట్లాడితే, తాము పూర్తిస్థాయిలో వారికి సహకరిస్తున్నామని చెప్పారని అన్నారు. ఈ విషయంలో ఎవరిని అడగాలో రైతులు అయోమయ పరిస్థితిలో ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. మండలవ్యాప్తంగా అనేక గ్రామాల్లో ఇంకా అర్హులైన రైతులు చాలామంది ఉన్నారని, వారిని గుర్తించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ అధికారులు పేపర్ ప్రకటన ఇవ్వకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అర్హులైన రుణమాఫీ కాని రైతులతో త్వరలో వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన వారిని వెంటనే గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కాంతాల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చోక్కల్ల శ్రీశైలం, మండల నాయకులు మొలుగూరి ఆంజనేయులు, రైతులు చోక్కల్ల శ్రీనివాస్, కున రవి, చోక్కల్ల పర్మరాములు, బుచ్చయ్య, కొమురయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.