- – జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
నేటి సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న 17514 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం క్రమబద్ధీకరించేందుకు మాత్రం ముందుకు రావకపోవడం దారుణమన్నారు. దీంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా అన్ని క్యాడర్స్కు 510 జీవోను వర్తింపజేయాలని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4వేల మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వం 510 జీవో అమలయ్యేలా చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులతో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెలా 1న వేతనాలు చెల్లించాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వారి కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా తీసుకురావాలి, ఎన్హెచ్ఎంలో 65 ఏండ్లు నిండినవారికి రిటైర్మెంట్ ప్రకటించి, ఉద్యోగి ఒక నెల పెన్షన్ రూ.25 వేలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

