- పోచమ్మ తల్లికి చలి బోనాలు
- మానాలలో భక్తి శ్రద్ధలతో వేడుకలు

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి (కోక్కుల వంశీ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మనాల గ్రామంలో బద్దిపోచమ్మ తల్లి దేవాలయం తో పాటు ఊర పోచమ్మకు మహిళలు ప్రతి ఏటా మాఘమాసం ప్రారంభంలో అమ్మవారికి చలి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం మానాల గ్రామంలోని పోచమ్మ ఆలయానికి తెల్లరుజామునుంచే పిల్లపాపలతో మహిళలు, భక్తులు పోటెత్తారు. మహిళలు ముందు రోజు రాత్రి తలంటుకొని నూతన దుస్తులు ధరించి అమ్మవారికి చలి బోనం వండి, మర్నాడు ఉదయం తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి రాత్రి వండిన అన్నంలో పెరుగు కలిపి చలి బోనంగా అమ్మవారికి సమర్పించి మమ్ము చల్లగ చూడు.. పోచమ్మ తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేయడం ద్వారా వారి వారి కుటుంబాలను పోచమ్మ తల్లి చల్లగా చూస్తుందని, పాడిపంటలు సమృద్ధిగా ఉండేలా చేస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనంతరం పోచమ్మ ఆలయ ఆవరణలో భక్తులు చలిబోనం నైవేద్యాలు ఆరగించి సరదాగా గడిపారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది.






