నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో హుజురాబాద్ మాల మహానాడు నాయకులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సొల్లు బాబు, మాల ఉద్యోగుల సంఘం నాయకులు పాక సతీష్, పసుల స్వామి, కోడిగుటి ప్రవీణ్, కోడం నరసింగం, నీరటి రవి లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సొల్లు బాబు మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,15, 16 ఉల్లంఘించి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. దళితులకు రాజ్యాధికారం దక్కకూడదనే కుట్రతోనే ఎస్సీలను ఏబిసిడి లుగా వర్గీకరించేందుకు ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్దంగా జరగలేదని, న్యాయస్థానాలు మనువాదుల జేబు సంస్థలుగా మారాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మాదిగలు, మాలలు జనాభా పరంగా సమానంగా ఉన్నారని అయినా మాలలను తక్కువ చేసి చూపుతున్నారని వాపోయారు. దేని ప్రకారం వర్గీకరణ చేపడుతుందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వర్గీకరణ పేరుతో కేంద్రంలోని బిజెపి పార్టీ మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టి అధికారం చలాయించాలని చూస్తుందన్నారు.