నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు సామాజిక ఉద్యమాల సృష్టికర్త మంద కృష్ణ మాదిగ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు నాయకులు పసుల రామ్మూర్తి , జూపాక సుధాకర్ లపైన తెలంగాణ ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ప్రజాసంఘాలు, ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు వారి పైన రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని సోమవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్ గారికి ఫిర్యాదు చేశారు. గత 30 సంవత్సరాలుగా మాదిగలకోసం, సమాజం లోని అన్ని వర్గాల ప్రజలు కోసం తమ కుటుంబాన్ని పక్కనపెట్టి గుండె జబ్బుల పిల్లల కోసం, వృద్ధుల , వితంతువుల కోసం ఉద్యమాలు చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించి పెట్టిన కృష్ణ మాదిగ పైన మాల మహానాడు నాయకులు విమర్శలు చేయడం వారి అవివేకం, అహంకారమని మండిపడ్డారు. ఎస్సీలలో ఉన్న 59 ఉప కులాలకు సమన్యాయం జరగాలని అంబేద్కర్ స్ఫూర్తి కి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ పైన మాల మహానాడు నాయకులు తమ తీరును మార్చుకోకపోతే పీడిత వర్గాల సమాజం చేతుల్లో మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం, రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, మొలుగూరి ప్రభాకర్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకుడు కలవల మల్లయ్య, అడ్వకేట్ కలకోటి శ్రావణ్, బొడ్డు సంజీవ్, మొలుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.




