Monday, March 30, 2026

ఎందరో మహిళలు – అందరికీ శుభాభినందనలు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): భారతదేశం వేల సంవత్సరాల నుండి కూడ స్త్రీలను గౌరవిస్తూ ” యత్ర నార్యస్తు పుజ్యంతే రమంతే తత్ర దేవతా: ” అన్నారు. అంటే ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. సంస్కృతి పరంగా త్రిమూర్తులకు మూలమైన ఆది పరాశక్తి స్త్రీ, ప్రకృతికి రూపం స్త్రీ. అందుకే ఋషులు మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమని చెప్పారు. భారతదేశంతో పాటు దేశదేశాల్లో గొప్ప స్థానాన్ని పొంది గౌరవింపబడిన స్త్రీ శక్తిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి వారు 1975 మార్చి 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు. ఈరోజును పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్న మహిళలను మరియు నిర్విరామంగా కృషి చేస్తున్న మహిళలను సత్కరించుకోవడం ఒక ఆచారంగా కాకుండా ఒక బాధ్యతగా జరుపుకోవలిసిన దినమిది. ఏ దేశంలోనైనా , ఏ కాలంలో అయినా పురుషులదే పై చేయిగా ఉన్నా కూడా గుండె నిబ్బరం చేసుకొని తమకంటూ ప్రత్యేకతను చాటుకుని గెలిచి నిలిచిన మహిళలు కోకొల్లలు. ఒకప్పుడు ఇల్లు దాటి రావడానికి కూడా ఆంక్షలు ఉన్న మహిళలు, నేడు ఆ శృంఖలాలను తెంచుకొని మేమేమీ పురుషుల కన్నా తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఏ రంగంలోనైనా రాణించగలుగుతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు ను తీర్చిదిద్దిన ఆనాటి జిజియాబాయి మొదలుకొని , కొన్ని నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమి మీదకు రాలేకపోయినా కూడా ధైర్యంగా ఉంటూ సేవలందిస్తున్న ఈనాటి సునీతా విలియమ్స్ వరకు ప్రతీ ఒక్క మహిళా అభినందనీయురాలులే. ఈరోజు గుర్తింపు తెచ్చుకొన్న మహిళలనే కాకుండా కుటుంబ శ్రేయస్సు కొరకు ఒకవైపు పనిచేస్తూ మరోవైపు ఇంటినీ చూసుకుంటున్న మహిళలతో పాటు, ఇంటికే పరిమితమై తమ శాయశక్తులా పిల్లలను తీర్చిదిద్దుకుంటున్న అందరు మహిళలకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

  • భాస్కర్ మంచికట్ల, హుజూరాబాద్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News