Monday, March 16, 2026

మెట్​పల్లి బ్యాంకులో భారీ చోరీ

  • – రూ.9 లక్షలు చోరీ.. పోలీసుల రికవరీ
  • – కేసు కట్టకుండానే వదిలేసిన వైనం
  • – బ్యాంక్ ఉద్యోగి విధుల నుండి తొలగించి.. నిందితులను వదిలేయడంపై అనుమానం
  • – చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న బ్యాంకు మేనేజర్, ఎస్సై
  • – ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్ దూలూరీ): జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్​లో సినీ ఫక్కీలో ఘరానా మోసం జరిగింది. అక్షరాల రూ. 9 లక్షలు కాజేసిన ఘనులను శిక్షించాకుండానే వదిలేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు నిందితులను పట్టుకున్న పోలీసులు. వారి నుంచి రికవరీ చేసి బ్యాంక్ వారికి రూ.9 లక్షల అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు మర్మం ఇక్కడే జరిగింది. వివరాల్లోకి వెళితే.. గత నెల డిసెంబర్ 30న పట్టణంలోని దాదాపుగా 30 వేల ఖాతాలు ఉన్న ఓ ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ లో మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మాజీ మహిళా సర్పంచ్ మేనల్లుడు బ్యాంకులో డబ్బులు జమ చేయాడానికి మరో ఇద్దరితో వస్తాడు. క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి, ఓచర్ నింపి, తన అకౌంట్​లో రూ.15 లక్షలు జమ చేసేందుకు తన వద్ద ఉన్న రూ.500 నోట్ల కట్టలు రూ.15 లక్షలను క్యాషియర్ కు ఇస్తాడు. క్యాషియర్ డబ్బులు కౌంట్ చేస్తుండగా, సదరు ఖాతాదారుడితో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు ఇతను క్యాషియర్ ను కన్ఫ్యూజ్ చేసి అందులో నుంచి 9 లక్షలను టేబుల్ మీద నుంచి కాజేసి, వారు వెంట తెచ్చుకున్న బ్యాగులో వేసుకొని, అక్కడి నుండి వెళ్లిపోతారు.

సదరు క్యాషియర్ అకౌంట్స్​ క్లోజింగ్ చేసేప్పుడు డబ్బులు కౌంట్ చేసే సమయంలో రూ.9 లక్షలు తక్కువ రావడంతో మేనేజర్ దృష్టికి తీసుకుపోగా, చెక్ చేసోకోగా వీరిపై అనుమానం వస్తుంది. అదే రోజు ఖాతాదారుడి వద్దకు వెళ్లి అడుగగా, అతను దబాయించడంతో మేనేజర్ పోలీస్ ను ఆశ్రయిస్తాడు. పెట్రోలింగ్​లో ఉన్న ఓ ఎస్సై నిందితుల వద్దకు వెళ్లి పోలీస్ స్టైల్లో అడిగి బ్యాంక్ లో ఉన్న సీసీ పుటేజీలను చూపగా, నిందితులు తప్పును ఒప్పుకొని, తమ వద్ద ఉన్న రూ.9 లక్షలను బ్యాంక్ వారికి అప్పగిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా సదరు వ్యక్తులు తెలిసి దొంగతనానికి పాల్పడినా, వారిపై బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయకుండా డబ్బులను రికవరీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం చేశాడంటూ బ్యాంక్ ఉద్యోగిని పక్కన పెట్టారు. అదే విధంగా దొంగతనం పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారంలో సదరు ఎస్సై కేసు కట్టకుండా, డబ్బులు నేరుగా బ్యాంక్ వారికి అప్పజెప్పడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాని, వానికి దొంగతనం కేసుల్లో రికవరీ జరిగిన సొత్తును కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు ఇవ్వాలి. ఇక్కడ అలాంటివి లేకుండానే ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న బ్యాంక్ మేనేజర్, ఎస్సై చట్టాన్ని వారి చేతిలోకి తీసుకొని, ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News