Monday, December 23, 2024

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు

  • వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి
  • ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు డీ శ్రీనివాస్ డిమాండ్​
  • కలెక్టర్​పై దాడికి పెద్దపల్లిలో ఉద్యోగుల నిరసన

నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి): రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ సిబ్బంది వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది, కలెక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు రెవెన్యూ సిబ్బంది నిరసన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ , వికారాబాద్ ఘటన చాలా దురదృష్టకరమని, అధికారులపై దాడులు చేయడం, ప్రజలకు రెవెన్యూ సిబ్బంది అనేక రకాలుగా అందించే సేవలను విస్మరిస్తూ, పూర్తి అవగాహన రాహిత్యంతో భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని అన్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని, అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు. ట్రెస్సా అసోసియేట్ అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే ఫార్మాసిటీ కోసం భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, కోడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ సిబ్బంది పై గ్రామస్తులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటూ పని చేసే రెవెన్యూ సిబ్బందిపై దాడులు అవాంఛనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడులు చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని, వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రెవెన్యూ సిబ్బంది భూసేకరణకు వెళ్తే, భద్రత కల్పించాలని ఈ సందర్భంగా సర్కారును కోరారు. అనంతరం కలెక్టర్ కు ట్రెస్సా జిల్లా కమిటీ తరఫున పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ట్రెస్సా అధ్యక్షుడు వకీల్, పెద్దపల్లి జనరల్ సెక్రెటరీ మహేష్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News