Friday, March 20, 2026

మధ్యవర్తిత్వమే ఎంతో మేలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- దేశంలో దినదినం పెరుగుతున్న కుటుంబ కలతలు, కలహాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబ తగాదాలు సత్వరం పరిష్కారమైతే జనజీవనం సాఫీగా సాగుతుందని భావించిన ప్రభుత్వం 1984లో కుటుంబ కోర్టుల చట్టం తెచ్చింది. రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాల్లోనే హైకోర్టులను సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశాయి. వైవాహిక వివాదాలు, ఇతర కుటుంబ తగాదాలు ఈ కోర్టులో పరిష్కారం అవుతాయి. న్యాయవాదుల అవసరం లేకుండా ఈ కోర్టులో కక్షిదారులు తమ కేసులను తామే వాదించుకోవచ్చు. న్యాయవాదులు కుటుంబ కలహాల్లో కలగజేసుకోకూడదని, వారు ఈ కుటుంబ కోర్టులకు రాకూడదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ చెప్తున్నది. పెండ్లిల్లు, విడాకులు, గృహహింస కుటుంబ ఆస్తి తగాదాల్లో ముందుగా రావలసింది ఈ కోర్టులకేనని చట్టం చెబుతున్నది. ఇలా ఏర్పడ్డ కుటుంబ కోర్టులు దేశం మొత్తం మీద 850 ఉన్నాయి. వాటిల్లో పేరుకుపోయిన కేసులు 11.95 లక్షలకు పైగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అత్యధికంగా ఉన్న 189 కుటుంబ కోర్టులలో 3.95 లక్షల కేసులు మూలుగుతూ ఉండగా, 37 కుటుంబ కోర్టులో 1.2 లక్షల కేసులతో దేశంలోనే కేరళ రెండో స్థానంలో ఉన్నది. కాపురాల్లో కలహాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కోట్లకు ఎక్కాల్సిన అవసరం లేదు. కోర్టులకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి నేడు అనేక మార్గాలు ఉన్నాయి. మార్గాలకు చట్టబద్ధత కూడా ఉంది. ప్రతి కోర్టులోను కోర్టు అనుబంధం మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పడి కక్షిదారులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నింటిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ లో మధ్యవర్తిత్వ చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు రంగంలో ఏర్పడ్డ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా కోర్టు డిక్రీ తో సమానమని మధ్యవర్తిత్వ చట్టం 2023 చెప్తున్నది. కక్షిదారులు తమ సమస్యను గోప్యంగా తామే పరిష్కరించుకొనే అవకాశాలు మధ్యవర్తిత్వ చట్టం, మధ్యవర్తిత్వ సంస్థలు కల్పిస్తున్నాయి. కోర్టులన్నీ ప్రజా కోర్టు అనే విషయం కక్షిధాలు గ్రహించాలి. కోర్టులో జరిగే వాదనలన్నీ కోర్టుహల్ లో ఉన్న వారందరికీ తెలియడమే కాకుండా ఇతరులు కూడా కక్షిదారుల సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. ఆలు మగల మధ్య మనస్పర్ధలు, కుటుంబ ఆస్తి పంపకాల విషయం, ఏ సమస్య అయినా గోప్యంగా గుడ్డు చప్పుడు కాకుండా పరిష్కరించుకునే అవకాశాలు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాల్లో ఉన్నాయి. ఈ వివాదాల విషయాల్లో, తెలంగాణలో 23 కోర్టులో 18,600 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 17 కుటుంబ కోర్టులలో 14300 కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆయా కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను పక్కన పెడితే, దినదినం కుటుంబాల్లో తగాదాలు పెరుగుతున్నాయి.. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలగించుకోకుండా ప్రాణాలు తీసుకుంటున్నారనేది అక్షర సత్యం. (వ్యాసకర్త : వ్యవస్థాపక చైర్మన్, డా. ఆర్ఎల్ మోతె ( న్యాయ సలహాదారు అండ్ అడ్వకేట్)
సఖ్యత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్)
9676761221

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News