- రేషన్ కార్డులపై ప్రతిపక్షలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
- నా రాజకీయ ప్రస్థానంలో ఇన్ని పథకాలు ఎప్పుడూ చూడలేదు
- త్వరలోనే ప్రతి ఒక్కరికి 6కిలోల సన్నబియ్యం


నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి ( కోక్కుల వంశీ ) : రేషన్ కార్డులపై ప్రతిపక్ష బిఆర్ యస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కావాలనే రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్య నారాయణ, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఇన్ని పథకాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాష్ట్రంలో 50% కుటుంబాలు దొడ్డు బియ్యం తినకపోవడం వల్లే రేషన్ అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. త్వరలోనే 70% రేషన్ కార్డుల్లో పేరున్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నామని చెప్పారు.

రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని అన్నారు. ఎంతమందికి అర్హత ఉంటే అంతమందికీ రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. పెళ్లయిన వారికి విడిగా కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల మార్పు చేర్పులు అన్ని పూర్తి చేస్తామని అన్నారు. అర్హత ఉన్న వాళ్లందరికీ ఇల్లు కట్టించే ప్రక్రియ చేపట్టామని, ఇండ్ల మంజూరు జాబితాలో పేరు లేకుంటే దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. స్వంతస్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని, ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్ష ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి 12,000 అందజేస్తున్నామ ని అన్నారు.





