నేటి సాక్షి గజ్వేల్:
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు చేతికొచ్చే కీలక సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
గజ్వేల్ పట్టణంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరా సమయాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోయినా వ్యవసాయ మోటార్లు ఆగిపోతున్నాయని, దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రస్తుతం పంటలు చేతికొచ్చే కీలక దశలో ఉన్నాయని, మరో నెల రోజుల్లో పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడకపోతే నియోజకవర్గ హెడ్‌క్వార్టర్లలో వేలాది మంది రైతులతో కలిసి సబ్‌స్టేషన్లను దిగ్బంధిస్తామని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందులో భాగంగా బుధవారం జగదేవ్‌పూర్ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.
రైతుల పక్షాన కేసీఆర్, బీఆర్‌ఎస్ మాత్రమే నిలబడతాయని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయకపోతే సబ్‌స్టేషన్లను ముట్టడించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కయ్యద్దీన్, కళ్యాణ్కర్ నరసింహారావు పాల రమేష్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.