నేటి సాక్షి, ధర్మారం: ధర్మారం మండల కేంద్రంలోని నందిమేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారిని డాక్టర్ యు. సుస్మిత ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ వై. పవిత్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. పీహెచ్సీ ఆవరణలో బతుకమ్మలను ఏర్పాటు చేసి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు వేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది బతుకమ్మ ఆడటంతో పీహెచ్సీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ వై. పవిత్ర మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు ఒకచోట చేరి వేడుకలు జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అన్నారు. బతుకమ్మ పండుగ మహిళల్లో ఐక్యత, ఆత్మీయతను పెంచుతూ ఆనందాన్ని పంచుతుందని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై జరుపుకునే బతుకమ్మ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సిబ్బంది విధులతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీ భవాని, సీహెచ్సీ డాక్టర్ శ్రావణ్, ఎంపీహెచ్ఈఓ నరసింహారెడ్డి, హెల్త్ అసిస్టెంట్ దామోదర్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.