నేటి సాక్షి చిలుకూరు: (మొక్క వెంకన్న గౌడ్)
చిలుకూరు : రైతులకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. చిలుకూరు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ సరఫరా లాగ్‌బుక్‌ను పరిశీలించారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
గతంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేయడం సరికాదని అన్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వెంటనే నివారించి, రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని అలాగే సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల సమస్యలపై మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జానకి రామాచారి తాళ్లూరు శ్రీనివాస్ బట్టు శివాజీ అలస కాని జనార్ధన్ అంబాల వెంకటి షేక్ పాషా మాధవరావు శ్రీను లింగరాజు నరసయ్య బెల్లం కొండ సైదులు షేక్ షాకీర్ అల్లి ఉపేందర్ ఉడుము కోటి కార్యకర్తలు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు..