నేటి సాక్షి కేసముద్రం :
కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యాన్ని రేషన్ కార్డు లబ్ధిదారుల వద్ద నుండి అక్రమంగా కొనుగోలు చేసి, నిల్వ ఉంచి, వేరే బ్రాండ్ బియ్యంగా చూపిస్తూ అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసముద్రం పోలీసులు చర్యలు చేపట్టారు.తేదీ గురువారం ఉదయం సుమారు 09:30 గంటలకు, కేసముద్రం పోలీస్ స్టేషన్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, కేసముద్రంలోని మైసూర్ బేకరీ సమీపంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు నమ్మదగిన సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు పంచుల సమక్షంలో సదరు వ్యక్తి అద్దెకు తీసుకున్న షాప్ గదిని తనిఖీ చేశారు.తనిఖీలో పరకాల మురళి తండ్రి బిక్షం, వయస్సు 46 సం,కులం రజక,వృత్తి వ్యాపారం, ఉప్పరపల్లి గ్రామం వద్ద 50 కిలోల చొప్పున 12 బస్తాలలో మొత్తం 600 కిలోలు (06 క్వింటాళ్లు) పిడిఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.విచారణలో సదరు వ్యక్తి రేషన్ కార్డు లబ్ధిదారుల వద్ద నుండి పిడిఎస్ బియ్యాన్ని కిలోకు రూ.10/- చొప్పున కొనుగోలు చేసి, తన వద్ద నిల్వ ఉంచి, అనంతరం వేరే రైస్ బస్తాలలో నింపి,వాటిని బ్రాండెడ్ బియ్యంగా చూపిస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.స్వాధీనం చేసుకున్న 600 కిలోల పిడిఎస్ బియ్యం విలువ సుమారు రూ.15,000 గా అంచనా వేయబడింది. బియ్యం నమూనాను శాస్త్రీయ రసాయన పరీక్షల నిమిత్తం సీజ్ చేసి,మిగిలిన బియ్యాన్ని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కేసముద్రం ఎస్‌ఐ కే. క్రాంతి కిరణ్ దర్యాప్తు చేపట్టి,తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు.