వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై

నేటిసాక్షి రంగారెడ్డి జిల్లా

వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్) నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రస్థాయి ‘స్వేచ్ఛా రథం’ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరీ బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు తమ హక్కులు, అందుబాటులో ఉన్న సహాయ మార్గాలపై అవగాహన కల్పించడంతో పాటు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 080-69434343 ను విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వెట్టిచాకిరీని పూర్తిగా నిరోధించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. వెట్టిచాకిరీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, బాధితులను గుర్తించడం, వారిని రక్షించడం, అవసరమైన సహాయం మరియు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు–క్వారీలు తదితర అసంఘటిత రంగాల్లో వెట్టిచాకిరీకి గురయ్యే అవకాశాలు ఉన్నందున, ‘స్వేచ్ఛా రథం’ ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు లేదా శ్రమ దోపిడీ ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
అప్పులు, అడ్వాన్సులు, బెదిరింపులు, మోసం లేదా స్వేచ్ఛను హరించే విధంగా బలవంతంగా పని చేయించడం వెట్టిచాకిరీగా పరిగణించబడుతుందని, వెట్టిచాకిరీ చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. బాధితులను గుర్తించి, విముక్తి కల్పించి, పునరావాసం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు.
‘స్వేచ్ఛా రథం’ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ కార్మికుల హక్కులు, వెట్టిచాకిరీని ఎలా గుర్తించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, బాధితులకు ప్రభుత్వపరంగా లభించే సహాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. 080-69434343 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడం ద్వారా వెట్టిచాకిరీ ఘటనలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో *కార్మిక శాఖ, పోలీసు/మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), మహిళా శిశు సంక్షేమ శాఖ (WCD)*తో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. IEC ప్రచార సామగ్రి పంపిణీ, మీడియా మరియు సమాచార పౌర సంబంధాల శాఖల సహకారంతో అవగాహన కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ‘స్వేచ్ఛా రథం’ ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతోంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయనున్నారు.