నేటి సాక్షి కేసముద్రం :
కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అద్దె ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదును అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కేసముద్రం ఎస్‌ఐ ఆర్. కే క్రాంతి కిరణ్ .పోలీసుల వివరాల ప్రకారం, జెనిగల అనిల్ కుమార్ (38), వృత్తి: వ్యవసాయం, కేసముద్రం గ్రామంలోని ఓలం చంద్రశేఖర్‌కు చెందిన ఇంట్లో గత మూడేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా శనివారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన ఉప్పరపల్లికి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బెడ్‌రూమ్‌లోని బీరువా లాకర్‌ను పగలగొట్టి అందులో భద్రపరిచిన 31 గ్రాముల బంగారు నెక్లెస్ (విలువ సుమారు రూ.1,50,000), 15 గ్రాముల బరువున్న రెండు బంగారు ఉంగరాలు (విలువ సుమారు రూ.50,000), రూ.28,000 నగదును అపహరించారు. చోరీకి గురైన సొత్తు మొత్తం విలువ సుమారు రూ.2,28,000గా బాధితుడు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పొరుగువారు బాధితుడికి సమాచారం అందించారు. దీంతో అనిల్ కుమార్ ఇంటికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కే క్రాంతి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.