ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో

నేటిసాక్షి/ములుగు


ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయంతో పాటు, చారిత్రక రామప్ప చెరువుకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న బొగ్గు గనుల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న స్పష్టం చేశారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో బొగ్గు గనుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. దేవాలయంతో పాటు దాని పరిసరాల్లోని రామప్ప చెరువు కూడా చారిత్రక, పర్యావరణ ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇలాంటి సున్నితమైన ప్రాంతాల సమీపంలో బొగ్గు గనుల ఏర్పాటు గురించి ఆలోచించడం ఆందోళన కలిగించే అంశం.
బొగ్గు గనుల తవ్వకాలు, బ్లాస్టింగ్ కార్యకలాపాలు ప్రారంభమైతే వాటి ప్రభావం రామప్ప దేవాలయ నిర్మాణ భద్రతపై, రామప్ప చెరువు నీటి వనరులపై, భూగర్భ జలాలపై, పర్యావరణంపై పడే ప్రమాదాన్ని విస్మరించకూడదు. భూమి స్వభావంలో మార్పులు, నీటి వనరులపై ప్రభావం, ప్రకృతి సమతుల్యతకు కలిగే నష్టాలు వంటి అంశాలను ముందుగానే శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. చారిత్రక కట్టడాల భద్రతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.
బొగ్గు గనుల తవ్వకాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, వాటి ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనల దశలోనే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి, ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. మైనింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నించడం కంటే, ముందుగానే ప్రమాదాలకు తావులేకుండా నిర్ణయం తీసుకోవడం మేలు. రామప్ప దేవాలయం, రామప్ప చెరువు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.
బొగ్గు సంపద కంటే మన చారిత్రక వారసత్వ సంపద ఎంతో విలువైనది. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రపంచానికి గర్వకారణమైన రామప్ప దేవాలయాన్ని, దాని పరిసరాల్లోని చెరువును ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకోకూడదు. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రాంతంలో మైనింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం పునరాలోచించి, వాటిని పూర్తిగా విరమించుకోవాలి.
ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పర్యావరణ చారిత్రక వారసత్వ పరిరక్షణ అంశాలపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదని భూక్య జంపన్న పేర్కొన్నారు. రామప్ప దేవాలయం, రామప్ప చెరువు పరిరక్షణ కోసం ప్రజలు, పర్యావరణవేత్తలు, చరిత్రకారుల ఆందోళనలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.