నేటి సాక్షి బెజ్జంకి
మెదక్ పట్టణం ఆటోనగర్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఆదర్శమని పేర్కొన్నారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి, పేద ప్రజల హక్కుల కోసం ధైర్యంగా నిలబడిన వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన, హేయమైన చర్య అని అన్నారు.ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే గుర్తించి, సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అలాగే విగ్రహానికి తగిన రక్షణ కల్పించి, దెబ్బతిన్న విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.చాకలి ఐలమ్మ కేవలం రజక సమాజానికే కాకుండా, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే రజక సమాజం సహించబోదని స్పష్టం చేశారు.రజక సమాజం ఐక్యంగా ఉండి, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ, దోషులకు చట్టపరంగా శిక్ష పడేలా పోలీసులకు సహకరించాలని కోరారు.