ఉప్పల్, అక్టోబర్ 13,( నేటి సాక్షి )
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టస్కా)మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని సంఘ కార్యాలయం లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో, టస్కా చిల్కానగర్ డివిజన్ శాఖ అధ్యక్షులు బొమ్మగాని దాస్ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. టస్కా ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా,డిసెంబర్ 11న రాష్ట్రస్థాయిలో నిర్వహించ నున్న ప్రత్యేక సమావేశానికి సన్నాహకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహారావు పాల్గొని సంఘ భవిష్యత్తు కార్యాచరణపై సందేశ మిచ్చారు.ఈ సమావేశానికి చిల్కానగర్ డివిజన్ శాఖ తరఫున అధ్యక్షులు బొమ్మగాని దాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ విద్యాసాగర్, కోశాధికారి, శామీర్‌పేట చంద్రయ్య, సలహాదారు పెండెం నాగార్జున హాజర్ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహా రావు మాట్లాడుతూ, చిల్కానగర్ డివిజన్ శాఖ ఆవిర్భావ సమావేశాన్ని అత్యంత వైభవంగా, క్రమబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆ కార్యక్రమం రాష్ట్రస్థాయి సమావేశాన్ని తలపించేలా సాగి, సీనియర్ సిటిజన్లలో నూతన ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. తాను స్వయంగా ఆవిర్భావ కార్యక్రమానికి హాజరై, అక్కడి ఏర్పాట్లు, నిర్వహణ, సభ్యుల ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంతో సంతోషించానని తెలిపారు.ముఖ్యంగా, మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి సుమతి, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులను, ఇతర ప్రముఖ అధికారులను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చిల్కానగర్ శాఖ నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.అనంతరం చిల్కానగర్ డివిజన్ శాఖ అధ్యక్షులు బొమ్మగాని దాస్ గౌడ్ మాట్లాడుతూ, శాఖ ఆవిర్భావం నుంచి గత నెల రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. వృద్ధుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి చేరువ చేయడం,సమాజంలో సీనియర్ సిటిజన్ల గౌరవ ప్రదమైన స్థానాన్ని మరింత బలోపేతం చేయడం తమ శాఖ ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. ఆయన వివరించిన కార్యాచరణ సమావేశానికి హాజరైన పెద్దలను ఆకట్టుకుంది.
నిబద్ధతతో కూడిన నాయకత్వానికి గుర్తింపు
సంఘ లక్ష్యాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ, తన విలువైన సమయాన్ని సంఘ అభివృద్ధికి కేటాయిస్తూ, సభ్యులకు స్ఫూర్తినిస్తూ చిల్కానగర్ శాఖను ముందుకు నడిపిస్తున్న బొమ్మగాని దాస్ గౌడ్ సేవలను ఈ సందర్భంగా జిల్లా శాఖ ప్రత్యేకంగా అభినందించింది,
ఆయన నాయకత్వ పటిమ, సేవాభావం, కార్యదక్షత, సీనియర్ సిటిజన్ల సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధతను గుర్తిస్తూ, రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహారావు జిల్లా శాఖ ప్రముఖులు, గౌరవ పెద్దల చేతుల మీదుగా ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆయన సేవలను భవిష్యత్తులో రాష్ట్రస్థాయిలోనూ వినియోగించుకుంటామని ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయపడ్డారు.
సేవకు సత్కారం నాయకత్వానికి ప్రోత్సాహం
బొమ్మగాని దాస్ గౌడ్‌కు లభించిన ఈ గౌరవం వ్యక్తిగత సన్మానం మాత్రమే కాకుండా, చిల్కానగర్ డివిజన్ శాఖ సమష్టి కృషికి, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం చేస్తున్న సేవలకు లభించిన గుర్తింపుగా పలువురు అభివర్ణించారు. ఈ సన్మానం శాఖ సభ్యుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణగా నిలుస్తుందని వారు ఆకాంక్షించారు.
సీనియర్ సిటిజన్ల అనుభవ సంపదను సమాజ అభివృద్ధికి వినియోగిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యం తో ముందుకు సాగాలనే సంకల్పంతో సమావేశం కొనసాగింది.